: పోలవరంకు ఖర్చు చేసిన ఐదు వేల కోట్లను ఇమ్మని అడిగా: చంద్రబాబు
గోదావరి పుష్కరాలకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అలాగే పుష్కరాల నిర్వహణకు నిధులను మంజూరు చేయాల్సిందిగా కోరామని... అన్ని విధాలా రాష్ట్రానికి సహాయసహకారాలు అందిస్తామని మోదీ హామీ ఇచ్చారని చెప్పారు. కమ్యూనిటీ మరుగుదొడ్లకు ఎక్కువ నిధులు ఇవ్వాలని కోరామని తెలిపారు. త్వరలోనే ఎల్ఎన్జీ జాయింట్ వెంచర్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వివరాలను తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ. 5 వేల కోట్లను ఇవ్వాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కోరినట్టు చెప్పారు. రాయలసీమ నుంచి రాష్ట్ర రాజధానికి రహదారుల నిర్మాణంపై నితిన్ గడ్కరీతో చర్చించామని వెల్లడించారు. అలాగే దుగరాజపట్నం ఓడరేవుపై కూడా గడ్కరీతో చర్చలు జరిపామని తెలిపారు. విశాఖపట్నం రైల్వే జోన్, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, కొత్త రైళ్లు తదితర అంశాలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో చర్చించామని చంద్రబాబు అన్నారు. రక్షణ శాఖ పరిశ్రమలను ఏపీలో పెట్టాలని ఆ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కు విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఉపాధి హామీ పథకానికి రూ. 1500 కోట్లను అదనంగా కేటాయించాలని కోరామని తెలిపారు.