: పోస్టింగులు రాని డీఎస్సీ అభ్యర్థులకు త్వరలో ఉద్యోగాలు: విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి
సరైన అర్హతలున్నా, వివిధ కారణాలతో ఉద్యోగాలు పొందలేకపోయిన డీఎస్సీ అభ్యర్థులకు త్వరలోనే పోస్టింగులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1998 డీఎస్సీతో పాటు ఇప్పటి వరకు జరిగిన అన్ని డీఎస్సీలనూ పరిశీలించి, పెండింగ్ లో ఉన్న అభ్యర్థులందరికీ పోస్టింగ్స్ ఇస్తామని విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. 1998లో డీఎస్సీ రాసేందుకు టీటీసీ ఉత్తీర్ణులు అయితే చాలని తొలుత ప్రకటించిన ప్రభుత్వం ఆ తరువాత కొందరు టీటీసీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం తెలిసిందే. వారి కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఆరుగురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో కేసు వేయగా, ఇటీవల తెలంగాణ సీఎస్ తన వాదన వినిపిస్తూ, ఆరుగురికి ఉద్యోగం ఇస్తే ఆరు వేల మందికి ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. కాగా, మంత్రి తాజా ప్రకటనతో డీఎస్సీ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.