: సెన్సార్ బోర్డు చైర్మన్ పదవికి లీలా శ్యామ్సన్ రాజీనామా... డేరా బాబా చిత్రానికి అనుమతిపై నిరసన


కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్ పదవికి లీలా శ్యామ్సన్ రాజీనామా చేశారు. వివాదాస్పద బాబా డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ రూపొందించిన చిత్రం ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ చిత్రానికి అనుమతి మంజూరుపై నిరసన వ్యక్తం చేసిన లీలా శ్యామ్సన్ తన పదవికి రాజీనామా చేశారు. పెను దుమారాన్ని రేపిన ఎంఎస్ జీ చిత్రానికి లీలా శ్యామ్సన్ అనుమతి మంజూరు చేయలేదు. నిబంధనల ప్రకారం సదరు చిత్రాన్ని ఆమె ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎఫ్ సీఏటీ) పరిశీలనకు పంపారు. అయితే, ట్రైబ్యునల్ సదరు చిత్రం విడుదలకు అనుమతించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లీలా గత రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. సెన్సార్ బోర్డుపై కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ పెత్తనం చెలాయిస్తోందని ఆరోపించిన ఆమె, తన రాజీనామాపై పునరాలోచించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ట్రైబ్యునల్ తీర్పు ఇస్తే, ఇందులో కేంద్రం పాత్ర ఏముందన్న విలేకరుల ప్రశ్నలకు స్పందించిన ఆమె, దేశంలో కొనసాగుతున్న దుస్థితికి ఈ ఉదంతం అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ట్రైబ్యునల్ తీర్పు నేపథ్యంలో ఎంఎస్ జీ చిత్రం నేడు దేశవ్యాప్తంగా విడుదల కానుంది.

  • Loading...

More Telugu News