: గోదావరి పుష్కరాలకు సాయం చేయాలని కేంద్రాన్ని కోరాం: చంద్రబాబునాయుడు
త్వరలో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, వెంకయ్యనాయుడు, ఉమా భారతి, రాజ్ నాథ్ సింగ్ లతో వరుస భేటీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోనూ సమావేశమయ్యారు. మంత్రులతో వరుస భేటీల అనంతరం ఆయన నిన్న రాత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని ప్రధాని మోదీని కోరానని ఆయన పేర్కొన్నారు. అంతేకాక రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కూడా విజ్ఞప్తి చేశానన్నారు. రాష్ట్రంలో జరగనున్న గోదావరి పుష్కరాలకు ఆర్థిక సహాయం చేయాలని విన్నవించినట్లు తెలిపారు. హుదూద్ ప్రభావిత ప్రాంతాలకు ప్రకటించిన సహాయంలో మిగతా నిధులను కూడా విడుదల చేయాలని కోరానన్నారు. ఇక శుక్రవారం కూడా మరికొంతమంది కేంద్ర మంత్రులను కలవనున్నట్లు ఆయన పేర్కొన్నారు.