: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీనేనా?


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరింత ఉత్సాహంగా ముందుకు సాగనుంది. రాజకీయ నేతల్లో అవినీతి పెచ్చుమీరిపోయిందని, ఈ కారణంగానే తాను రాజకీయాల్లో చేరుతున్నట్లు ప్రకటించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపైనా కూర్చోగలిగారు. కేజ్రీవాల్ కు చెక్ పెట్టేందుకు నిన్నటిదాకా తీవ్ర తర్జనభర్జన పడ్డ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఎట్టకేలకు కిరణ్ బేడీ రూపంలో పరిష్కారం లభించినట్లైంది. విధి నిర్వహణలో నిజాయతీ అధికారిగా పేరుగాంచడంతో పాటు భారత చట్టాలపై అపార అనుభవం ఉన్న కిరణ్ బేడీని ఆయన కొద్దిసేపటి క్రితం పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమిత్ షా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా సీఎం అయ్యే అవకాశాలున్నాయన్న ఆయన కిరణ్ బేడీ కూడా సామాన్య కార్యకర్తగానే కొనసాగుతారని పేర్కొన్నారు. అంతేకాక కిరణ్ బేడీతో తమ పార్టీ ఢిల్లీ శాఖ మరింత బలోపేతం కానుందన్న ఆయన, ఆమె ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారని కూడా ప్రకటించారు. అమిత్ షా ప్రకటనల నేపథ్యంలో ఆ పార్టీ ఢిల్లీ సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీ రంగంలోకి దిగనున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

  • Loading...

More Telugu News