: నిజామాబాద్ లో దొంగల స్వైర విహారం... దోచుకున్న ఇంటిని తగులబెట్టిన వైనం
నిజామాబాద్ లోని హౌసింగ్ బోర్డు కాలనీలో దొంగలు స్వైర విహారం చేశారు. సంక్రాంతి పర్వదినాన ఓ ఇంటిలో చొరబడ్డ దొంగల ముఠా, ఇంటిని పూర్తిగా దోచుకుంది. ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టింది. చోరీలో భాగంగా దొంగలు ఎనిమిది తులాల బంగారం, కిలో వెండితో పాటు రూ.1.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. దొంగతనంపై ఫిర్యాదునందుకున్న పోలీసులు చోరుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. డాగ్ స్క్వాడ్ తో నిర్వహించిన దొంగల వేటలో పోలీసులు నెంబర్ లేని ఓ కారును గుర్తించారు. ఈ కారును దొంగలు వాడినదిగానే పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ చేసి సొత్తు ఎత్తుకెళ్లడంతో సరిపెట్టని దొంగలు ఇంటిని తగులబెట్టిన వైనంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.