: బీజేపీలోకి వలసల పర్వం... జయప్రద, కిరణ్ బేడీ, షాజియా ఇల్మీల చేరే అవకాశం!
నరేంద్ర మోదీ ప్రభంజనంతో కేంద్రంలోనే కాక ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోనూ అధికారం చేజిక్కించుకున్న బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. పలు పార్టీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో కమలదళంలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని వివిధ పార్టీల నేతలు బీజేపీలో చేరగా, తాజాగా దేశంలోనే పేరెన్నికగన్న మహిళా ప్రముఖులు జయప్రద, కిరణ్ బేడీ, షాజియా ఇల్మీలు ఆ పార్టీలో చేరనున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఉద్దండ రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై జయప్రదను బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఢిల్లీ రాజకీయాల్లో కీలక నేతగా ఆవిర్భవించనున్నారని భావిస్తున్న రిటైర్ట్ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ కూడా బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరి చేరికతో ఢిల్లీలో బీజేపీ మరింత బలోపేతం కానుందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.