: టోర్నీ నుంచి మాయమై, ప్రియుడితో ప్రత్యక్షమైన హాకీ క్రీడాకారిణి
హాకీ పోటీల కోసమని వెళ్లి, కనిపించకుండా పోయి అందరినీ టెన్షన్ పెట్టిన ఓ క్రీడాకారిణి చివరకు ప్రియుడితో పాటు పోలీసులకు పట్టుబడింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 16 ఏళ్ల కరిష్మా సోన్కర్ రాంచీలో జరిగిన జాతీయ స్థాయి జూనియర్ హాకీ టోర్నమెంట్ లో ఆడేందుకు వెళ్లింది. పోటీలు ముగిశాక జట్టుతో పాటు జలియన్ వాలాబాగ్ ఎక్స్ ప్రెస్ రైలులో బయలుదేరిన కరిష్మా మధ్యలో అదృశ్యమైంది. మూడు రోజులు గడిచినా ఆమె ఇల్లు చేరకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. కరిష్మా సోన్కర్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు నిన్న తన ప్రియుడితో కలసి ఉన్న ఆమెను పట్టుకున్నారు. తాను ఇంటికి తిరిగి వెళ్లనని కరిష్మా చెబుతుండగా, ఇద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించి ఇంటికి పంపుతామని పోలీసులు తెలిపారు.