: వరంగల్ దారుణం... కదులుతున్న కారులో మహిళపై నాలుగు రోజుల పాటు లైంగిక దాడి
వరంగల్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కదులుతున్న ఓ కారులో నలుగురు కామాంధులు ఓ మహిళపై నాలుగు రోజులు పాటు అత్యాచారానికి ఒడిగట్టారు. నేటి ఉదయం జిల్లాలోని వర్ధన్నపేట మండలం పంతిని వద్ద నిందితులు బాధితురాలిని కింద పడేసి వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా అందిన వివరాల మేరకు... నెల్లూరు జిల్లాకు చెందిన బాధితురాలు వరంగల్ కు వచ్చినట్లు తెలుస్తోంది. మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో కత్తితో బెదిరించి కారులో ఎక్కించుకున్న దుండగులు ఆమెపై సామూహికంగా అత్యాచారానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల పాటు కదులుతున్న కారులోనే ఆమెపై లైంగిక దాడి కొనసాగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.