: 'వైబ్రాంట్ గుజరాత్' అదుర్స్... తొలి రోజే రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వరద!
గుజరాత్ రాజధాని గాంధీ నగర్ లో జరుగుతున్న ‘వైబ్రాంట్ గుజరాత్’ సదస్సు రికార్డులను సృష్టిస్తోంది. ప్రారంభమైన తొలి రోజే రూ.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించిన ఈ సదస్సు, గుజరాత్ పారిశ్రామిక రంగానికి సరికొత్త జవసత్వాలను అందించింది. తొలి రోజు సమావేశాల్లో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఒక్కరే లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఆ రాష్ట్రంలో పెట్టనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాష్ట్రంలోని అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఎల్లప్పుడూ తాము సిద్ధమేనని ఆయన ప్రకటించారు. ఇక, ఆదిత్యా బిర్లా గ్రూపు అధినేత కుమార మంగళం బిర్లా కూడా గుజరాత్ లో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అమెరికా కంపెనీతో కలిసి రూ.25 వేల కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు ఆదానీ గ్రూపు ప్రకటించింది. ఆస్ట్రేలియా కంపెనీ రియో టింటో రూ.20 వేల కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. ఇక వెల్ స్పన్ రూ.8,300 కోట్లు, సుజుకీ గ్రూపు రూ.4 వేల కోట్లు, కళ్యాణి గ్రూపు రూ.600 కోట్ల పెట్టుబడులను ప్రకటించాయి.