: విమానంలోనే పారిశ్రామికవేత్తలతో భేటీ... నూతన ఒరవడికి చంద్రబాబు శ్రీకారం
కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని నిర్మాణం, కొత్తగా పరిశ్రమల ఏర్పాటు... తదితర కారణాల నేపథ్యంలో ఏ ఒక్క క్షణాన్ని కూడా వృథా చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సిద్ధంగా లేరు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన నేటి మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు. ఢిల్లీలో ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్న చంద్రబాబు తిరుగు ప్రయాణంలో భాగంగా విమానంలోనే జపాన్ ప్రతినిధి బృందంతో చర్చలు జరపనున్నారు. ఇప్పటిదాకా ఈ తరహాలో విమానంలోనే పెట్టుబడులకు సంబంధించిన సమీక్షల దాఖలా లేదనే చెప్పాలి. తనకు అందుబాటులో ఉన్న సమయాన్ని అత్యంత విలువైనదిగా భావిస్తున్న చంద్రబాబు, విమానంలో భేటీ విషయంపై జపాన్ బృందానికి ముందే సమాచారం అందించారు. దీనికి జపాన్ ప్రతినిధులు కూడా సరేననడంతో ఢిల్లీ నుంచి బయలుదేరే చంద్రబాబు, హైదరాబాద్ చేరుకునేలోగానే జపాన్ బృందంతో సమీక్ష ముగించనున్నారు.