: బ్రావో, పోలార్డ్ అవుట్...వరల్డ్ కప్ విండీస్ జట్టిదే
న్యూజిలాండ్-ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2015 వన్డే ప్రపంచ కప్ జట్ల ఎంపిక పలు వివాదాలకు తావిస్తోంది. సీనియర్లను పక్కన పెట్టిన పలు క్రికెట్ బోర్డులు వివాదాలు కొనితెచ్చుకుంటున్నాయి. భారత క్రికెట్ లో అంత్యంత ప్రతిభావంతుడిగా పేరుతెచ్చుకున్న యువరాజ్ సింగ్ కు చోటుకల్పించకపోవడంపై టీమిండియా క్రీడాభిమానులు భగ్గుమనగా, తాజాగా విండీస్ జట్టులో సీనియర్ ఆటగాళ్లు డ్వెన్ బ్రావో, కీరన్ పొలార్డ్ కు సెలెక్టర్లు మొండిచెయ్యి చూపారు. జాసన్ హోల్డర్ ను కెప్టెన్ గా, మార్లోన్ శామ్యూల్స్ ను వైస్ కెప్టెన్ గా నియమించిన విండీస్ చీఫ్ సెలెక్టర్ క్లైవ్ లాయిడ్, బ్రావో, పొలార్డ్ ను పక్కనపెట్టారు. బోర్డుతో వివాదం, తాజా ఫాం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు భావిస్తుండగా, విండీస్ అభిమానులు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, విండీస్ జట్టులో జాసన్ హోల్డర్ (కెప్టెన్), మార్లోన్ శామ్యల్స్ (వైస్ కెప్టెన్), బెన్, డారెన్ బ్రావో, కార్టెర్, కాట్రెల్, క్రిస్టోఫర్ గేల్, సునీల్ నరైన్, రాందిన్, రోచ్, రసెల్, సమీ, సిమన్స్, డ్వెన్ స్మిత్, జెరోమీ టేలర్ లు చోటు దక్కించుకున్నారు. అత్యుత్తమ జట్టునే వరల్డ్ కప్ కు ఎంపిక చేశామని క్లైవ్ లాయిడ్ తెలిపారు.