: భారత్ కు ఉజ్వల భవిష్యత్తు ఉంది... అన్ని విధాలా సహకరిస్తాం: ప్రపంచ బ్యాంకు ఛైర్మన్
అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న భారత్ కు ఉజ్వల భవిష్యత్తు ఉందని ప్రపంచ బ్యాంకు ఛైర్మన్ జిమ్ యాంగ్ కిమ్ అన్నారు. పేదరికాన్ని అంతం చేసే విషయంలో తమకు భారత్ మార్గనిర్దేశం చేస్తుందని చెప్పారు. భారత్ లోని ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను సమకూరుస్తామని కిమ్ స్పష్టం చేశారు. సోలార్ విద్యుత్ అంశంలో భారత ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు దృష్టి సారిస్తాయని... రానున్న రోజుల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా అవతరిస్తుందని చెప్పారు. అనేక అంశాలపై భారత ప్రభుత్వంతో కలసి ప్రపంచ బ్యాంకు పనిచేస్తుందని కిమ్ తెలిపారు. ఉజ్వల గుజరాత్ సదస్సులో ప్రసంగిస్తూ, ఈ వివరాలను వెల్లడించారు. భారత ప్రభుత్వం తీసుకువచ్చిన గూడ్స్, సర్వీస్ ట్యాక్స్ (జీఎస్ టీ) బిల్లును తాము స్వాగతిస్తున్నామని, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది ఎంతో దోహదపడుతుందని కిమ్ తెలిపారు. ఈ ఏడాది భారత్ 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందని అంచనా వేశారు.