: కుల రాజకీయాలను ప్రోత్సహించం: ఢిల్లీ సభలో మోదీ
ఢిల్లీలో బీజేపీ ప్రచార భేరి మోగింది. ఇక్కడి రామ్ లీలా మైదానంలో నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో ప్రసంగించారు. తాము కుల, ప్రాంత రాజకీయాలను ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు. ప్రజల ప్రేమ, విశ్వాసం అండగా బీజేపీ 2014 నుంచి విజయపరంపర కొనసాగిస్తోందని అన్నారు. బీజేపీని విశ్వసించి, ఆదరించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు ఘనవిజయం అందించారని, వారికి ధన్యవాదాలని చెప్పారు. జమ్మూకాశ్మీర్ ప్రజలు సైతం చిరస్మరణీయ విజయం అందించారని, వారు బీజేపీకి బాసటగా నిలిచారని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని పునరుద్ఘాటించారు. మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల్లోని ప్రజలు తమపై భరోసా ఉంచారని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనలో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు. ప్రతి వ్యక్తికీ బ్యాంకు ఖాతా లక్ష్యం నెరవేరుతోందని తెలిపారు. తన ప్రసంగంలో ప్రధాని మోదీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వెంకయ్యనాయుడికి విశాఖ, విజయవాడ, హైదరాబాదు నగరాల్లోని సమస్యలే కాదు, ఢిల్లీలోని గల్లీల్లో ఉన్న సమస్యలు కూడా తెలుసని చెప్పారు. వెంకయ్యకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలపై అవగాహన ఉందని అన్నారు. ఆయనకున్న అవగాహన చూస్తే ఆశ్చర్యం వేస్తోందని తెలిపారు. అంతకుముందు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, మోదీ అండతోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి వివేకం ప్రదర్శించారో, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలాగే వ్యవహరించాలని ప్రజలను కోరారు. బీజేపీని గెలిపిస్తే లక్ష ఇళ్లు నిర్మిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.