: బ్రిటన్ లో 'పారిస్' తరహా దాడికి అల్ ఖైదా ప్రణాళిక!
అల్ ఖైదా తీవ్రవాద సంస్థ బ్రిటన్ లో 'పారిస్' తరహా దాడులకు దిగేందుకు వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. బ్రిటన్ గూఢచార సంస్థ ఎంఐ5 డైరక్టర్ జనరల్ ఆండ్రూ పార్కర్ ఈ మేరకు హెచ్చరించారు. ఫ్రెంచి పత్రిక చార్లీ హెబ్డోపై జరిగిన దాడి రీతిలోనే పెద్ద సంఖ్యలో పలువురిని చంపేందుకు అల్ ఖైదా పొంచి ఉన్నట్టు అనుమానిస్తున్నామని ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో తాము బ్రిటీష్ పోలీసులతో కలిసి మూడు ఉగ్రదాడుల యత్నాలను అడ్డుకున్నామని పార్కర్ తెలిపారు. యూకేలో టెర్రర్ ముప్పు అధికమవుతోందని అన్నారు. తాము ఉగ్రవాదుల ప్రతి ప్రయత్నాన్ని నిలువరించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, తమ భాగస్వామ్య సంస్థలతో కలిసి తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పారు.