: 'ఉగ్ర'దాడుల భయంతో అకాడమీకి తాళం వేసుకున్న పాక్ క్రికెటర్
పాకిస్థాన్ స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ తన క్రికెట్ అకాడమీని మూసివేశాడు. కొంతకాలంగా స్వస్థలం ఫైజలాబాద్ లో అజ్మల్ ఓ క్రికెట్ అకాడమీని నడుపుతున్నాడు. ఇటీవల కాలంలో పాక్ లో ఉగ్రవాదుల దాడులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో అజ్మల్ అకాడమీకి కూడా అతివాద శక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయట. దీంతో, అకాడమీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఈ క్రికెటర్ తెలిపాడు. పంజాబ్ ప్రభుత్వం ఈ మేరకు సూచన చేసిందని వెల్లడించాడు. ఈ విషయమై ఫైజలాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ను, అగ్రికల్చర్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ను కలిసినట్టు అజ్మల్ మీడియాకు తెలిపాడు. విశ్వవిద్యాలయ భూముల్లోనే అజ్మల్ తన అకాడమీ ఏర్పాటు చేశాడు.