: ఏపీలో పాగాపై అమిత్ షా దృష్టి... నేడు ఏపీ శాఖ పదాధికారులతో భేటీ!
తెలంగాణలో పార్టీ స్థితిగతులను పరిశీలించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పై దృష్టి సారించనున్నారు. హైదరాబాదులో పార్టీ తెలంగాణ శాఖ సమీక్షను ముగించిన ఆయన రాత్రికే విజయవాడ చేరుకున్నారు. నేటి ఉదయం అమిత్ షా, పార్టీ ఏపీ శాఖ పదాధికారులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రంలో పార్టీ స్థితిగతులు, మెరుగైన ఫలితాల సాధన కోసం చేపట్టాల్సిన వ్యూహాలు తదితరాలపై ఆయన స్థానిక నేతలతో చర్చించనున్నారు. అంతేకాక, రానున్న కాలంలో రాష్ట్రంలో మరిన్ని సీట్లను కైవసం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అందుకు అనుకూల, ప్రతికూల అంశాలపైనా ఆయన దృష్టి కేంద్రీకరించనున్నారు. అమిత్ షా విజయవాడలో తొలిసారిగా అడుగుపెట్టిన నేపథ్యంలో పార్టీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.