: పోలీసుల వేధింపులకు తాళలేక సెల్ టవర్ ఎక్కిన మహిళలు
ఒక ఎస్సై అసభ్యకరంగా ప్రవర్తించి, దుర్భాషలాడారంటూ ముగ్గురు మహిళలు ఆందోళనకు దిగారు. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తూ, ఖమ్మం జిల్లా కారేపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఉన్న సెల్ టవర్ పైకి ఎక్కారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ ఘర్షణ నేపథ్యంలో పాటిమీదిగుంపు గ్రామానికి చెందిన ధారావత్ చంద్రకళ, హలావత్ బుజ్జి, బాణోతు బుల్లి బంధువులైన తొమ్మిది మందిపై కేసు నమోదైంది. విచారణ నిమిత్తం స్టేషన్ కు తీసుకెళ్ళిన ఎస్సై పి.సంతోష్ విచక్షణ కోల్పోయి తొమ్మిది మందిని తీవ్రంగా కొట్టారు. మహిళలు, వికలాంగులు అని కూడా చూడకుండా దుర్భాషలాడారు. దీంతో మనస్తాపం చెందిన వీరు ఎస్సైపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సెల్ టవర్ ఎక్కారు. పోలీసులు, ఉన్నతాధికారులు వచ్చి న్యాయం చేస్తామని చెప్పడంతో వారు కిందకు దిగారు.