: తన జీవిత చరిత్ర సినిమాలో సచినే హీరో!
మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ జీవిత చరిత్రపై సినిమా నిర్మించేందుకు ముంబయికి చెందిన '200 నాట్ అవుట్' అనే నిర్మాణ సంస్థ సిద్ధమవుతోంది. ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా కథనం ప్రకారం, ఇంకా టైటిల్ నిర్ణయించని సచిన్ పై రూపొందించే చిత్రం కోసం పనులు మొదలవబోతున్నట్టు తెలిపింది. మాస్టర్ వృత్తి జీవితంలోని ఎత్తు పల్లాలు, ఆయన వ్యక్తిగత జీవితం, బాల్యం, యవ్వనదశ, డాక్టర్ అంజలితో ప్రేమ, పెళ్లి విషయాలన్నీ ఇందులో స్పృశించనున్నట్టు పేర్కొంది. ఇందులో హైలైట్ ఏంటంటే తనపై రూపొందించే చిత్రంలోని ప్రధాన పాత్రను సచినే పోషించనుండటం విశేషమని వెల్లడించింది. లండన్ కు చెందిన అవార్డు విన్నింగ్ రచయిత, దర్శకుడు జేమ్స్ ఎర్స్కిన్ ఈ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నాడట. ప్రపంచంలోని పలువురు ప్రముఖులు కూడా ఈ చిత్రంలో భాగస్వాములు కానున్నారు. ఈ సినిమా హక్కులను వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ తీసుకోనుందట.