: ఈ రాజస్థాన్ పేసర్ కూడా చాపెల్ బాధితుడే!


దీపక్ చహర్... భారత్ లో ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ ఆడుతున్న ఫాస్ట్ బౌలర్లలో ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ రాజస్థాన్ కుర్రాడి బౌలింగ్ లో వేగం ఒక్కటే కాదు, టెక్నిక్ కూడా ఉంటుంది. ఆ విషయం అటుంచితే, టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ 2008లో రాజస్థాన్ క్రికెట్ సంఘం అకాడమీలో ప్రధాన శిక్షకుడిగా వ్యవహరించాడు. అప్పుడు దీపక్ చహర్ ను చూసి పెదవి విరిచాడట చాపెల్ మహాశయుడు. ఉన్నతస్థాయి క్రికెట్ ఆడేందుకు సరిపోడని అకాడమీలో చేర్చుకునేందుకు నిరాకరించాడు. ఎంతో ఆశతో అక్కడిదాకా వచ్చిన యువ చహర్ నిరాశతో వెనుదిరిగాడు. కాలక్రమంలో రెండేళ్లు గడిచాయి. రాజస్థాన్, హైదరాబాద్ జట్ల మధ్య రంజీ మ్యాచ్ లో సంచలనం నమోదైంది. జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు దారుణంగా 21 పరుగులకే ఆలౌటైంది. అందుకు కారణం దీపక్ చహర్! ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో 10 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు. అతనికదే తొలి మ్యాచ్! దీంతో, దేశవ్యాప్తంగా రాజస్థాన్ యువకిశోరం పేరు మార్మోగిపోయింది. కాగా, చాపెల్ తనను ఎంపిక చేయకపోవడాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు చహర్. తనను ఎందుకు ఎంపిక చేయలేదని చాపెల్ ను ప్రశ్నించానని తెలిపాడు. హై లెవల్ క్రికెట్ ఆడలేవన్న కారణంతో ఎంపిక చేయలేదని చెప్పాడని వివరించాడు. దీంతో, ఎంతో బాధపడ్డానని, అయితే కుంగిపోలేదని అన్నాడు. అప్పటి నుంచి కఠోరంగా శ్రమించానని, తద్వారా రాజస్థాన్ రంజీ జట్టులో చోటు దక్కించుకున్నానని చెప్పాడు.

  • Loading...

More Telugu News