: రోహిత్ క్లీన్ బౌల్డ్... టీమిండియా రెండో వికెట్ డౌన్!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ తడబడుతోంది. సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైన తర్వాత టీమిండియా బ్యాట్స్ మన్ రోహిత్, లోకేశ్ రాహుల్ (43) మరో వికెట్ పడకుండా కొద్దిసేపు జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఆసీస్ 572 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన నేపథ్యంలో ఖాతా తెరవకుండానే ఓపెనర్ మురళీ విజయ్ పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన భారత స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ ఆచితూచి ఆడినా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న మరుక్షణమే ఆసీస్ బౌలింగ్ సంచలనం నాథన్ లియాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. రోహిత్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(4) వచ్చీరాగానే బ్యాట్ ఝుళిపించాడు. ఎదుర్కొన్న రెండో బంతినే బౌండరీ దాటించి తన ఉద్దేశమేమిటో చెప్పాడు. 45 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి భారత్ 102 పరుగులు చేసింది.