: రేపే శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు... రాజపక్సకు గట్టిపోటీ!
శ్రీలంకకు మూడవసారి కూడా తానే అధ్యక్షుడు అవ్వాలన్న గట్టి కోరికతో మహింద రాజపక్స రాజీనామా చేసి మరీ ఎన్నికలకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపే అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. పోలింగుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, రాజపక్స మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడం ఈసారి ఏమంత సులువు కాదంటున్నారు. ప్రతిపక్షాలు ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నాయని, ఆయన ప్రత్యర్థి మైత్రిపాల సిరిసేనకు పలు పార్టీలన్నీ కలసి మద్దతు ఇస్తున్నాయని సమాచారం. లంకలో మొత్తం 15,86,598 మంది ప్రజలు ఓటింగ్ కు అర్హులు. కాగా, ఇప్పటికే రాజపక్స వర్గం నుంచి కొంతమంది సిరిసేన వర్గంలోకి వెళ్లడం, ఇద్దరికీ గట్టి బలం ఉండటంతో అధ్యక్ష ఎన్నిక హోరాహోరీగా ఉంటుందని భావిస్తున్నారు. రాజపక్స కుటుంబ పాలనను అంతమొందిస్తానని సిరిసేన అంటే, మాతృభూమికోసం పాటుపడతానని, ద్రోహం చేయనని రాజపక్స ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేశారు. హ్యాట్రిక్ కొడతానని రాజపక్స పూర్తి ధీమాతో కూడా ఉన్నారు. దాంతో, ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది ఉత్కంఠగా మారింది.