: మొబైల్ వాటర్ ప్యూరిఫైయర్.. పైగా సోలార్!
ఇదేదో డబుల్ బోనాంజాలాగా కనిపిస్తోంది కదూ. నీటిని శుద్ధి చేసుకోడానికి ఇంట్లో వాడే ప్యూరిఫైయర్‌లకే మనం బోలెడు ఖర్చు చేస్తుంటాం. అలాంటిది భారీ పరిమాణంలోనైనా నీటిని శుద్ధి చేయగల యంత్రం.. మొబైల్‌గా అందుబాటులోకి వస్తుందంటే.. మంచిదే అనిపిస్తుంది. గంటకు 17 లీటర్ల నీటిని శుభ్రం చేసే ఈ యంత్రాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించుకుపోవచ్చు. మరైతే.. ఎక్కడపడితే అక్కడ కరెంటు ఎలా దొరుకుతుంది అనుకుంటే.. దీనికి సోలార్ ప్లేట్లు కూడా ఉన్నాయి. దీన్ని పనిచేయించే విద్యుత్తు మోటార్ సోలార్ ప్లేట్లకు అనుసంధానమై ఉంటుంది. ఎంచక్కా నీళ్లు శుద్ధి అవుతాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉపయోగించడానికి మాత్రమే కాకుండా.. పార్కులు, పిక్నిక్‌లలో డిన్నర్లు ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఇంత బహుళ ప్రయోజనాలు ఉన్న ఈ నీటిశుద్ధి యంత్రాన్ని చిత్తూరు జిల్లాకు చెందిన బాలకృష్ణ తయారుచేశాడు. మామూలు వాటర్ ప్యూరిఫైయర్‌ల పరిజ్ఞానాన్నే ఉపయోగించి.. పైన సోలార్ ప్లేట్లు, కింద చక్రాలు అమర్చి.. బహుళ ప్రయోజనకారిగా మార్చాడు.