: స్కోరు చూస్తే కొండలా ఉంది... ఏం చేస్తారో?


సిడ్నీలో భారత్ ముందు భారీ స్కోరు నిలిచింది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్సును 572/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (117) సిరీస్ లో మరో సెంచరీ సాధించడం రెండో రోజు ఆటలో హైలైట్. వాట్సన్ (81), మార్ష్ (73), బర్న్స్ (58) రాణించడంతో కంగారూలు భారీ స్కోరు సాధించారు. అనంతరం బరిలో దిగిన భారత్ ఆట చివరికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. ఓపెనర్ విజయ్ డకౌటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (31 బ్యాటింగ్), రోహిత్ శర్మ (40 బ్యాటింగ్) ఉన్నారు. కాగా, ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు టీమిండియా ఇంకా 501 పరుగులు వెనుకబడే ఉంది. చేతిలో 9 వికెట్లున్నాయి. ఈ నేపథ్యంలో, భారమంతా బ్యాట్స్ మెన్ పైనే ఉంది. అంతకుముందు, 348/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బరిలో దిగిన ఆసీస్ తొలుత వాట్సన్ వికెట్ కోల్పోయింది. అనంతరం, సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే స్మిత్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన షాన్ మార్ష్, బర్న్స్ ధాటిగా ఆడడంతో ఆసీస్ 500 మార్కు అధిగమించింది. అయితే, వీరిద్దరినీ షమీ అవుట్ చేయడంతో భారత్ కాస్త ఊపిరి పీల్చుకుంది. టీ విరామానంతరం ఆసీస్ కెప్టెన్ స్మిత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అనంతరం బ్యాటింగుకు దిగిన టీమిండియాకు మూడో బంతికే షాకిచ్చాడు కంగారూ పేసర్ మిచెల్ స్టార్క్. ఓపెనర్ విజయ్ వికెట్లకు దూరంగా వెళుతున్న బంతిని ఆడబోయి వికెట్ కీపర్ హాడిన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బరిలో దిగిన రోహిత్ శర్మ మరో ఓపెనర్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్సును చక్కదిద్దే పనిలో పడ్డాడు. ఈ జోడీ ఆచితూచి ఆడి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడింది.

  • Loading...

More Telugu News