: 'మంగళయాన్' సక్సెస్ వెనుక మూఢనమ్మకం!
అంగారకుడిపైకి భారత్ ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ 'మంగళయాన్' విజయవంతం కావడం వెనుక ఓ మూఢనమ్మకం దాగి ఉందా? అంటే, ఇద్దరు వ్యక్తులు 'కచ్చితంగా ఉంది' అనే జవాబు చెబుతారు. వారిలో ఒకరు అప్పటి ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ కాగా, మరొకరు మిషన్ డైరక్టర్ ఎస్.అరుణన్. 'మంగళయాన్' ప్రయోగానంతరం స్పేస్ క్రాఫ్ట్ కీలక దశలు దాటే సమయంలో అరుణన్ కంట్రోల్ రూం నుంచి తరచు వెలుపలికి వచ్చేసేవారట. కాసేపు మౌనంగా ఉండి, తిరిగి లోనికి వెళ్లేవారు. ఆయన అలా ఎందుకు ప్రవర్తించేవారన్న విషయం ఆ సమయంలో అక్కడున్న ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తెలియదట. రాధాకృష్ణన్ కి దీని గురించి తెలిసినా ఆయన గుంభనంగా ఉండేవారు. దీంతో, ప్రముఖులు, ఇతర శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపై మిషన్ డైరక్టర్ ఎస్.అరుణన్ మాట్లాడుతూ, ఇది మూఢనమ్మకమే అయినా, తమకు మాత్రం అదృష్టం తెచ్చిపెట్టింది అని తెలిపారు. కంట్రోల్ రూంను మోదీ సందర్శించిన సమయంలో అయితే అరుణన్ అగ్నిపరీక్ష ఎదుర్కొన్నారట. ప్రధాని రాక సందర్భంగా ఆయన భద్రత సిబ్బంది కఠిన ఆంక్షలు విధించడమే అందుకు కారణం. ప్రధాని అక్కడి నుంచి వెళ్లిపోయేవరకు కంట్రోల్ రూంలో ఎవరూ లోనికి రావడం గానీ, బయటికి వెళ్లడం గానీ చేయకూడదని సూచించారు. అయినా, అరుణన్ మూఢనమ్మకం వాటన్నింటినీ వెనక్కినెట్టింది. యథావిధిగానే ఆయన కంట్రోల్ రూం వెలుపల నిలుచుని కాసేపటి తర్వాత లోపలికి వచ్చేసేవారట. రాధాకృష్ణన్ అందుకెంతో సహకరించారని అరుణన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే, ఎందుకలా లోపలికీ బయటికీ తిరుగుతున్నారంటూ ఆయనను ఓ కమాండో ప్రశ్నించాడట. గాలి పీల్చుకోవడానికి వచ్చానంటూ బదులిచ్చానని అరుణన్ వెల్లడించారు.