: ఢిల్లీ చేరిన ఎంసెట్ వివాదం... కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రి గంటా భేటీ!
తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన ఎంసెట్ వివాదం దేశ రాజధాని ఢిల్లీ చేరింది. ఎంసెట్ నిర్వహణపై ఇరు రాష్ట్రాలు పట్టుబడుతున్న నేపథ్యంలో, రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చేసిన యత్నాలు కూడా ఫలించలేదు. దీంతో ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నేటి ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించాలని ఆయన పలువురు కేంద్ర మంత్రులను కోరనున్నారు. ఇప్పటికే ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. ఎంసెట్ వివాదంపై తాజా పరిస్థితిని ఆయనకు వివరించారు. మరికొద్దిసేపట్లో ఆయన కేంద్ర మానవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీతోనూ భేటీ కానున్నారు.