: కేసీఆర్ పై మోదీ అసంతృప్తి... అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వని మోదీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని మోదీ అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదన్న సంగతి టీఆర్ఎస్ వర్గాలను ఆవేదనకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళ్తే, ఇటీవల ఓ పెళ్లి కోసం కేరళ వెళ్లిన కేసీఆర్... అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లి మోదీని కలవాలని అనుకున్నారట. కానీ, టీఎస్ ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో, ఆయన ఢిల్లీ వెళ్లాలనే ఆలోచనను విరమించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. తమ అధినేతకు మోదీ అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడంతో, టీఆర్ఎస్ నేతలు షాక్ కు గురయ్యారు. ఇటీవల ప్లానింగ్ కమిషన్ మార్పులకు సంబంధించి ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ కు మోదీ మంచి ప్రాధాన్యత ఇచ్చారని సంబరపడిపోయిన టీఆర్ఎస్ నేతలు, తాజాగా మోదీ వ్యవహరించిన తీరుతో నిరుత్సాహానికి గురయ్యారు. తాను అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న స్వచ్ఛ భారత్, సుపరిపాలన దినం కార్యక్రమాలకు కేసీఆర్ ప్రాముఖ్యత ఇవ్వకపోవడంతో మోదీ అసంతృప్తికి గురయ్యారని సమాచారం. దీనిపై భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ, కొన్ని స్వార్థ శక్తులు కావాలనే మోదీకి కేసీఆర్ ను దూరం చేయాలని ప్రయత్నిస్తున్నాయని, అవి ఫలించవని అన్నారు.