: మా నీళ్లపై వారి పెత్తనమేంటి?: ఏపీపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న హరీశ్ రావు
కృష్ణా నది జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు. సోమవారం జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలో ఇరు రాష్ట్రాలు తమతమ వాదనలనే పట్టుకుని వేలాడాయి. దీంతో వాటి మధ్య సయెధ్య కుదర్చడం తనకు సాధ్యం కాదని కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు చేతులెత్తేసింది. బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టింది. ఈ నేపథ్యంలో కృష్ణా నదీ జలాల విషయంలో తమ వాటాపై ఏపీ పెత్తనమేమిటంటూ తెలంగాణ స్వరం పెంచింది. తమ వాటా నీటిని తమ అవసరాలకనుగుణంగా వాడుకునే హక్కు కూడా లేదా? అంటూ ఆ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన నేడు ఢిల్లీ వెళుతున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతిని కలవనున్న ఆయన, ఏపీ వైఖరిపై ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తమ వాటా నీటిపై ఏపీ పెత్తనమేమిటని ఆయన కేంద్ర మంత్రి ముందు కాస్త గట్టిగానే గళం విప్పనున్నారు. మరి ఆయన ఫిర్యాదుకు ఉమా భారతి ఎలా స్పందిస్తారో చూడాలి.