: సిడ్నీ క్రికెట్ గ్రౌండులో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడేనా?
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో భారత జట్టు చివరి టెస్టుకు సిద్ధమైంది. సిరీస్ లో నాలుగోదైన ఈ మ్యాచ్ మంగళవారం ఆరంభం కానుంది. తొలి రెండు టెస్టుల్లో ఓటమిపాలైన టీమిండియా మూడో టెస్టును డ్రా చేసుకుంది. సిరీస్ 0-2తో చేజారిన నేపథ్యంలో ఇప్పుడు చివరి టెస్టులో నెగ్గి కాసింత ఊరట పొందాలని భావిస్తోంది. ఇదిలావుంటే, ఆఖరి టెస్టుకు వేదికైన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో భారత్ రికార్డు దారుణం! ఇప్పటివరకు ఈ మైదానంలో మనవాళ్లు 10 టెస్టులాడగా, ఒక్కదాంట్లో నెగ్గారు. అదీ 36 ఏళ్ల క్రితం! మరో 5 మ్యాచ్ ల్లో పరాజయం పాలై, 4 మ్యాచ్ లను డ్రా చేసుకున్నారు. ఈసారైనా పేలవ రికార్డును సవరించాలని కోహ్లీ అండ్ కో కృతనిశ్చయంతో ఉంది. అయితే, బ్యాటింగ్ ఆర్డర్లో నిలకడలేమి వేధిస్తోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ అంచనాలు అందుకోవడంలో విఫలమవుతున్నాడు. అటు, కొత్త కుర్రాడు కేఎల్ రాహుల్ మెల్బోర్న్ టెస్టులో విఫలమయ్యాడు. షాట్ సెలక్షన్ సరిగా లేకపోవడం అతని వైఫల్యాలకు కారణం. అతనికి మరో చాన్సివ్వాలని సెలక్టర్లు భావిస్తే తుది జట్టులో చోటు దక్కుతుంది. ఇక, మిడిలార్డర్లో రోహిత్ శర్మ స్థానానికి రైనా నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. రైనాను కూడా పరీక్షించి చూడాలని టీమిండియా మేనేజ్ మెంట్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు చెత్త ఇన్నింగ్స్ లు ఆడిన ఛటేశ్వర్ పుజారా ఈ మ్యాచ్ తోనైనా గాడినపడితే ఆసీస్ బౌలర్లకు కష్టాలు తప్పవు. జాన్సన్ గైర్హాజరీ నేపథ్యంలో కంగారూ పేసర్లు భారత బ్యాటింగ్ లైనప్ ను ఎలా నిలువరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కిందటి పర్యటనలతో పోల్చితే, బౌలింగ్ పరంగానూ గణనీయమైన మార్పులే కనిపిస్తున్నాయి. టీమిండియా పేసర్లు సమష్టిగా రాణిస్తున్నారు. అయితే, బ్యాట్స్ మెన్ నుంచి తగిన అండ లభించకపోవడంతో వారి శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ఇషాంత్, షమి, ఉమేశ్ ఆసీస్ పేస్ పిచ్ లపై రాణిస్తున్నారు. చివరి టెస్టుకు స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కూడా జట్టులో చేరితే ఆసీస్ బ్యాటింగ్ లైనప్ కు వారి సొంతగడ్డపై పరీక్ష తప్పదు. తొలిసారి భారత జట్టుకు పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీకి నాలుగో టెస్టు విషమ పరీక్షగానే చెప్పవచ్చు. ధోనీ టెస్టులకు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో కోహ్లీ కొత్త బాధ్యతలను ఎంతమేర సమర్థవంతంగా నిర్వర్తించగలడన్నది సిడ్నీ టెస్టుతో తేలనుంది. అయితే, దూకుడుగా వ్యవహరించే కోహ్లీ జట్టుపై తన ముద్ర వేస్తాడనడంలో సందేహం అక్కర్లేదని మాజీలంటున్నారు. ఒత్తిడిలో రాణించే విశిష్ట గుణం ఈ ఢిల్లీ యువకెరటం సొంతమని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా, కోహ్లీ పై ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందిస్తూ అతను పోటీతత్వం గల ఆటగాడని అన్నాడు.