: ఏకంగా 7 పరుగులతో ఖాతా తెరిచాడు!
వెస్టిండీస్ ఓపెనర్ క్రెగ్ బ్రాత్ వైట్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఏకంగా 7 పరుగులతో ఖాతా తెరిచాడు. తద్వారా చరిత్రలో నిలిచాడు. కేప్ టౌన్ టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు విండీస్ ఓపెనింగ్ ద్వయం బరిలో దిగింది. సఫారీ పేసర్లు స్టెయిన్, ఫిలాండర్ నిప్పులు చెరగడంతో పరుగులు తీసేందుకు బ్రాత్ వైట్, డెవాన్ స్మిత్ చెమటోడ్చారు. ఫిలాండర్ విసిరిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రెండో బంతిని బ్రాత్ వైట్ స్క్వేర్ డ్రైవ్ చేశాడు. బ్రాత్ వైట్ 3 పరుగులు తీసిన అనంతరం, వికెట్ కీపర్ డివిల్లీర్స్ బంతిని వికెట్ల వైపు విసిరేశాడు. అయితే, అది ఫీల్డర్లను తప్పించుకుని బౌండరీని తాకింది. ఓవర్ త్రో పరుగులు బ్యాట్స్ మన్ ఖాతాలోకి వస్తాయన్న సంగతి తెలిసిందే. దీంతో, ఒక్క బంతికే బ్రాత్ వైట్ ఖాతాలో ఏడు పరుగులు చేరాయి. దీంతో, ఏకంగా 7 పరుగులతో అతను ఖాతా తెరిచినట్టయింది. ఇలా జరగడం టెస్టు చరిత్రలో ఇదే ప్రథమం.