: నేను టెస్టు క్రికెట్ ఆడుతున్నానట!: బీహార్ సీఎం
బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝి తన మంత్రుల్లో కొందరిపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు పరచే క్రమంలో తన సామర్థ్యాన్ని సందేహిస్తున్నారని, తాను టెస్టు క్రికెట్ ఆడుతున్నానంటూ ఎద్దేవా చేస్తున్నారని అన్నారు. పాట్నాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, "కొందరు నేను టెస్టు క్రికెట్ ఆడుతున్నానని సణుగుతున్నారు. మరికొందరు వన్డే క్రికెట్ ఆడుతున్నానంటున్నారు, ఇంకొందరు టి20 క్రికెట్ ఆడుతున్నానంటున్నారు. ఏ క్రికెట్ ఆడినా అన్ని హామీలను తప్పక నెరవేరుస్తా" అని వివరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చగలనన్న సత్యాన్ని జీర్ణం చేసుకోవాలని మంత్రివర్గ సహచరులకు స్పష్టం చేశారు. ఓ ఫంక్షన్లో మాట్లాడుతూ మాంఝి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన కులాలకు చెందిన కాంట్రాక్టర్లు రూ.50 లక్షల వరకు విలువైన పనులను టెండర్లు లేకుండానే దక్కించుకోవచ్చని ప్రకటించానని, అయితే, ఈ ప్రకటనను క్యాబినెట్ లోని కొందరు సహచరులు జీర్ణించుకోలేకున్నారని బీహార్ సీఎం తెలిపారు.