: నేనేమీ రోబోను కాను: పవన్ కల్యాణ్ పై ప్రశ్నలకు స్పందించలేనన్న రేణు దేశాయ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోమారు ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పవన్ కల్యాణ్ పై సంధించే ప్రశ్నలకు తాను ఎంతమాత్రం స్పందించనని ట్విట్టర్ లో కరాఖండీగా చేప్పేసింది. ఆయనపై తాను స్పందించిన ప్రతిసారి వివాదం చెలరేగుతోందని, సదరు వివాదాలతో తానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పేర్కొన్న ఆమె, ఇకపై పవన్ పై ఎలాంటి ప్రశ్నలకు స్పందించేది లేదని తేల్చిచెప్పింది. తన బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్ని ప్రశ్నలు పవన్ గురించే అడిగారని ఆమె అసహనం వ్యక్తం చేసింది. పవన్ పై మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ తన గురించి లేనిపోని ఊహాగాలు చేస్తున్నారని రేణు వాపోయింది. అయినా పవన్ వద్దకు తిరిగి వెళ్లే ఉద్దేశం కాని, అతడి పేరును వాడుకునే అవసరం కాని తనకు లేవని స్పష్టం చేసింది. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే తాను, ప్రతి ట్వీట్ ను పవన్ ను దృష్టిలో పెట్టుకునే చేయడం లేదని కూడా రేణు దేశాయ్ వెల్లడించింది. అయినా తానేమీ రోబోను కాదని, తనకూ వ్యక్తిత్వం, అభిరుచులు ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె చెప్పింది.