: మమ్మీ, డాడీ, జాడీ, కేడీ, బీడీ... ఏంటిది?: వెంకయ్యనాయుడు
తెలుగు భాషలోని తీయదనాన్ని, గొప్పదనాన్ని ఎంతోమంది ప్రముఖులు కీర్తించిన సంగతి తెలిసిందే. అయితే, మారుతున్న కాలంలో ఆంగ్ల భాషకు ప్రాధాన్యత పెరిగిపోవడం చాలా మందికి ఆవేదననే మిగులుస్తోంది. క్రమక్రమంగా తెలుగును ఆంగ్ల భాష మింగేస్తోంది. ఈ నేపథ్యంలో, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇంగ్లీషును నెత్తికెక్కించుకోవడంపై మండిపడ్డారు. 'మమ్మీ' అని పిలవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందని... 'అమ్మా' అని పిలవడంలో ఉండే కమ్మదనం మమ్మీ అన్న పిలుపులో ఉంటుందా? అని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. 'మమ్మీ, డాడీ, జాడీ, కేడీ, బీడీ... ఏటిదంతా? నాన్సెన్స్' అంటూ అసహనం వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ రోడ్డును ఎంజీ రోడ్ అని, సర్దార్ పటేల్ రోడ్డును ఎస్పీ రోడ్ అని పిలుస్తున్నామని... మహాత్ముల పేర్లను కూడా ఇంగ్లీష్ షార్ట్ కట్ లతో పిలవాలా? అని ప్రశ్నించారు. ఏదైనా తప్పు చేసినప్పుడు... 'క్షమించండి' అనాలని అన్నారు. 'క్షమించండి' అన్న పదం బయటకు రావాలంటే హృదయాంతరాల్లోనుంచి రావాలని... అదే 'సారీ' అనే పదం అయితే నాలుక మీద నుంచే బయటకు వస్తుందని ఎద్దేవా చేశారు. ఎంతో గొప్పదైన తెలుగు భాషను గౌరవిద్దామని... కమ్మని తెలుగులో మాట్లాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు.