: ఫిబ్రవరి మధ్యలో ఢిల్లీలో త్రిముఖ పోరు... వ్యూహ ప్రతివ్యూహాల్లో పార్టీలు
ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి మధ్యలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ల మధ్య జరగనున్న త్రిముఖ పోరుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఓటరు జాబితాను ఎన్నికల సంఘం నేడో, రేపో విడుదల చేయనుంది. తాజా ఎన్నికలతో ఏడాది కాలంలోనే ఢిల్లీ ప్రజలు మూడు సార్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ఆయా రాష్ట్రాల్లో వరుసగా విజయ దుందుభి మోగిస్తూ వస్తున్న క్రమంలో ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గడచిన ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేతలు ఓటమి చెందిన నేపథ్యంలో ఆ పార్టీ ఇప్పటిదాకా సీఎం అభ్యర్థిని ప్రకటించే సాహసం చేయలేదు. ఇదే విషయాన్ని అవకాశంగా తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీని ఇరుకున పెడుతోంది. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటమి చవిచూసిన కాంగ్రెస్ ఈ దఫా ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లైనా సాధించాలని కసరత్తు చేస్తోంది. ఇక చేతికందిన అధికారాన్ని నేలపాల్జేసి ప్రస్తుత అనిశ్చితికి కారణమైన తమను తిరిగి ప్రజలు ఆదరిస్తారా? అన్న సంశయం అరవింద్ కేజ్రీవాల్ ను వెంటాడుతోంది.