: హిందువులు ఏకమైతే దేశాభివృద్ధిని ఆపడం ఎవరి తరమూ కాదు: మోహన్ భగవత్
హిందువులంతా ఏకమైతే దేశాభివృద్ధిని నిలువరించడం ఏ ఒక్కరి తరం కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. హిందువుల ఐక్యతే దేశానికి రక్ష అని ఆయన వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్ లో జరిగిన ఆరెస్సెస్ మూడు రోజుల కార్యకర్తల సదస్సు ముగింపు సమావేశంలో పాల్గొన్న సందర్భంగా భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ దేశంగా భారత్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే హిందువులంతా ఒక్కతాటిపైకి రావాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు. ‘‘గతంలో ప్రపంచానికి మార్గదర్శనం చేసిన భారత్ విశ్వగురువుగా నిలిచింది. అప్పుడు ప్రపంచం శాంతియుతంగా ఉండేది. ఆ వైభవం మళ్లీ తీసుకురావాలంటే హిందువులంతా ఏకం కావాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో దేశభక్తి భావాలను పెంపొందింపజేయడంలోనే కాక జాతి నిర్మాణంలోనూ ఆరెస్సెస్ కీలక భూమిక పోషిస్తుందని ఆయన చెప్పారు. ఆరెస్సెస్ ను బయటి నుంచి చూడటం కాదని, అది చేసే మంచి పనులను గమనించి సంఘ్ లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.