: పాటల్లో నడుస్తాను...ఈ సినిమాలో ఏదో డాన్సు చేశా..వెంకీ అన్నయ్యతో చనువుంది!: పవన్ కల్యాణ్


సాధారణంగా తాను పాటల్లో నడుస్తానని, ఈ సినిమాలో కాస్త డాన్స్ చేశానని పవన్ కల్యాణ్ నవ్వుతూ చెప్పారు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగిన ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, 'గోపాల గోపాల' సినిమాలో పాటలన్నీ బాగున్నాయని అన్నారు. నితిన్ సినిమా 'గుండె జారి గల్లంతయ్యిందే' ఆడియో వేడుకకు వచ్చినప్పుడు ఆ పాటలు నచ్చాయని, అప్పుడే అనూప్ తో సినిమా చేయాలని అనుకున్నానని పవన్ తెలిపారు. 'గోపాల గోపాల'కి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ అని చెప్పగానే ఓకే చెప్పేశానని పవన్ చెప్పారు. 'గబ్బర్ సింగ్ 2' తరువాత వచ్చే తన సినిమాకు కూడా అనూపే సంగీత దర్శకుడని పవన్ కల్యాణ్ చెప్పారు. హీరో వెంకటేష్ గారి కామెడీ బాగుంటుందని పవన్ అన్నారు. సినీ పరిశ్రమకు రాకముందు తాను రోజూ వెంకీ ఇంటికెళ్లి కావాల్సింది తీసుకునే వాడినని పవన్ చెప్పాడు. తాను సినీ పరిశ్రమలో చనువుగా వెళ్లింది కేవలం వెంకటేష్ గారింటికేనని పవన్ వెల్లడించారు. సినీ పరిశ్రమలో తాను కలిసే అతి తక్కువ మందిలో ఆయన ప్రముఖుడని, వెంకటేష్ తనకు అన్నయ్య లాంటి వారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఎలాంటి ఆకారం లేని దేవుడ్ని తాను నమ్ముతానని, చదవాల్సిన టైంలో తాను సరిగ్గా చదవలేదని, అందువల్ల ఈ ప్రపంచంలో ఇమడలేమని భావించి నా ఫ్రెండ్ ఆనంద్ సాయితో కలసి శ్రీశైలం అడవుల్లోకి పారిపోదామని నిర్ణయించుకున్నానని పవన్ తెలిపారు. ఇంతలో హైదరాబాదు నుంచి అన్నయ్య ఫోన్ చేశారని చెప్పారు. "రేయ్ ఎక్కడున్నావు?" అనడిగితే 'ఇక్కడే ఉన్నానన్నయ్యా' అని నసిగానన్నారు. "రేపు ఉదయం బయల్దేరి హైదరాబాదు రా" అని ఆయన ఆర్డర్ వేయడంతో హైదరాబాద్ వస్తే తనను ధ్యానంలో చేర్చారని చెప్పారు. దీంతో పారిపోవడం సంగతి పక్కన పెట్టి, 'ఎంతసేపూ ధ్యానం' అంటూ ఇతరులకు సలహాలిచ్చేవాడినని పవన్ వెల్లడించారు. 'బాగా పెట్టే అన్న, ఒదిన ఉన్నారు కనుక ఎన్నైనా చెబుతావురా' అని ఆ రోజు అన్నయ్య చెప్పిన మాటలు చెంపమీద కొట్టినట్టైందని పవన్ కల్యాణ్ వివరించారు. ఆథ్యాత్మికంగా బతకడం ఎంత కష్టమో సినిమాల్లో నటిస్తుండగా తెలిసిందని పవన్ కల్యాణ్ చెప్పారు. 'ఖుషీ' చేసిన తరువాత ప్రీమియర్ చూస్తుండగా, అకస్మాత్తుగా మనసు లోతుల్నుంచి, 'రాబోయే కొన్ని సంవత్సరాలు బాగోదనే ఫీల్' వచ్చిందని పవన్ తెలిపారు. దీంతో అలా లేచి నీరసంగా వచ్చేశానని చెప్పారు. కష్టాలు రాబోతున్నాయని, వాటిని ఆపలేనని తనకు తెలుసని పవన్ వెల్లడించారు. అయితే ఆ తరువాత వచ్చిన ఫ్లాపులతో బాధపడుతుంటే అభిమానులు వచ్చి 'ఒక్క విజయం ఇవ్వన్నా' అని అడగడంతో, ఇంత వరకు దేవుడిని ఏదీ కోరని తాను, ఒకే ఒకటి కోరుకున్నానని పవన్ తెలిపారు. 'దేవుడా! నన్ను అభిమానించే అభిమానులు ఆనందించేలా ఒకే ఒక్క విజయం ఇవ్వు' అని కోరానని ఆయన వెల్లడించారు. 'కానీ దేవుడు ఎంత కరుణించాడంటే వరుసగా విజయాలు అందించాడు. అది సాధ్యమైంది అభిమానులు చూపించే అప్యాయత వల్లే'నని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News