: ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూత
టాలీవుడ్ ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ (57) కన్నుమూశారు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం కిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కేన్సర్ సోకిన నేపథ్యంలో ఆయన ఇటీవలే కిమ్స్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే ఆయన తుది శ్వాస విడిచారు. ఆహుతి ప్రసాద్ కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్. కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన ఆయన ‘ఆహుతి’ చిత్రంలో నటించి ఆహుతి ప్రసాద్ గా స్థిరపడిపోయారు. పలు చిత్రాల్లో తనదైన శైలిలో ఉత్తమ నటన కనబరచిన ఆహుతి ప్రసాద్ 2003 (నేను నిన్ను ప్రేమిస్తున్నాను- ఉత్తమ విలన్), 2008 (చందమామ- ఉత్తమ కేరెక్టర్ ఆర్టిస్ట్)లలో రెండు సార్లు నంది అవార్డులను అందుకున్నారు. ‘ఈ ప్రశ్నకు బదులేదీ?’ చిత్రంతో సినీ జీవితం ప్రారంభించిన ఆహుతి ప్రసాద్...విలన్ గానే కాక కేరెక్టర్ ఆర్టిస్టుగానూ ప్రేక్షకుల ప్రశంసలందుకున్నారు. తెలుగులో 275 చిత్రాల్లో నటించిన ఆహుతి ప్రసాద్, తమిళంలో రెండు చిత్రాల్లో నటించారు. బాలీవుడ్ లోనూ రంగప్రవేశం చేసిన ఆహుతి ప్రసాద్, అమితాబ్ బచ్చన్ చిత్రం సూర్యవంశ్ చిత్రంలో నటించారు. కన్నడ చలనచిత్ర రంగంలో నిర్మాతగా అరంగేట్రం చేసిన ఆహుతి ప్రసాద్ మూడు చిత్రాలను నిర్మించారు. సినిమాల్లో నటనకే పరిమితం కాకుండా సినీ నటుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)’ ప్రధాన కార్యదర్శిగానూ ఆహుతి ప్రసాద్ పనిచేశారు.