: కడప జడ్పీ సమావేశంలో తెలంగాణ ఎంపీ... ఉద్రిక్తత!
తెలంగాణకు కేటాయించిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కడప జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొనడం ఉద్రిక్తతకు దారితీసింది. నేటి ఉదయం జడ్పీ సమావేశం ప్రారంభం కాగా, సీఎం రమేష్ ఏ అధికారంతో హాజరయ్యారని వైసీపీ ఎంఎల్ఏ ప్రసాదరెడ్డి అభ్యంతరం తెలిపారు. దాన్ని పరిగణనలోకి తీసుకుని సీఎం రమేష్ వెళ్లిపోవాలంటూ జడ్పీ చైర్మన్ రవి రూలింగ్ ఇచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన సీఎం రమేష్ "మెజారిటీ సభ్యులు ఉన్నారని ఇలా చేస్తున్నారు. రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నామన్న సంగతి మరచిపోవద్దు" అని హెచ్చరించారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ సభ్యులు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.