: జయప్రదను చూసి ఎవరో అనుకున్నారట!
అలనాటి అందాల నటి, మాజీ ఎంపీ జయప్రద శుక్రవారం హైదరాబాద్ విచ్చేశారు. మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావుతో ఆమె భేటీ అయ్యారు. అయితే, అంతకుముందు ఆసక్తికర పరిణామాలు జరిగాయి. హరీశ్ రావు క్వార్టర్స్ లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులకు ఉదయం అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జయప్రద కూడా వచ్చినా హరీశ్ రావు ఆమెను గుర్తుపట్టలేకపోయారు. ఎవరో అధికారి అని భావించారట. ఆమె ముందే పలుమార్లు అటూ ఇటూ తిరిగారట. తనకు జయప్రద న్యూ ఇయర్ విషెస్ చెబుతున్నప్పుడూ హరీశ్ ఆమెను గుర్తించలేకపోయారు. చివరికి మీడియా ప్రతినిధులు జయప్రద రాకను హరీశ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన "అవునా?... ఎవరో అధికారి అనుకున్నాను" అంటూ స్పందించారు. వెంటనే జయప్రద కూర్చున్న టేబుల్ వద్దకు వెళ్లి ఆమెను కలిశారు. అనంతరం ఆమెతో 15 నిమిషాలు మాట్లాడారు. అంతకుముందు, మీడియా ప్రతినిధులు జయప్రద వచ్చిన విషయాన్ని హరీశ్ రావు కార్యాలయ సిబ్బందికి తెలిపినా వారు ఆయనకు చెప్పలేదట. జయప్రదను కూర్చోమని చెప్పి వారి పనిలో వారు నిమగ్నమయ్యారు.