: అధికారుల పనితీరు మెరుగుపర్చాలి: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఏపీ సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకుంది. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్న పవన విద్యుత్ సంస్థకు స్థలం కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. పెండింగ్ లో ఉన్న 41 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అదనపు నిధులు అవసరమని మంత్రి వర్గం అభిప్రాయపడింది. వీటికి 7 వేల కోట్లు అదనంగా చెల్లించాలని నిర్ణయించింది. జలయజ్ఞం పనులు చేపట్టిన గుత్తేదారులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన మంత్రి వర్గం, సకాలంలో పనులు పూర్తి చేయకుంటే చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. విద్యుత్ ఛార్జీల పెంపుపై మంత్రి వర్గం చర్చించింది. అధికారుల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, దానిని సరిదిద్దాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ నెల 18న స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ను లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించారు. డ్వాక్రా రుణ మాఫీకి మహిళా సాధికార కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని, ఏక గవాక్ష విధానంలో పరిశ్రమల అనుమతులకు ఆమోదించారు. కాగా, పూర్తి పారిశ్రామిక విధానాన్ని వచ్చే మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించాలని నిర్ణయించారు.