: సముద్రంలో ఏ క్షణంలో ఏం జరిగింది... ఉగ్రవాదుల్ని ఎలా పట్టుకున్నారు?
డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి పోరుబందర్ తీరానికి సరిగ్గా 365 కిలోమీటర్ల దూరంలో పాక్ వైపు నుంచి ఓ బోటు అనుమానాస్పదంగా రావడాన్ని కోస్ట్ గార్డ్ సిబ్బంది గమనించారు. ఆ మత్స్యకార బోటును వెంటనే ఆపాల్సిందిగా బోటులోని వారికి కోస్ట్ గార్డ్ సిబ్బంది హెచ్చరికలు జారీచేశారు. హెచ్చరికలు వినపడుతున్నా బోటులో ఉన్నవాళ్లు వినిపించుకోలేదు. బోటు స్పీడు పెంచారు, అక్కడ్నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో హెచ్చరికగా కోస్ట్ గార్డ్ సిబ్బంది బోటుపై కాల్పులు జరిపారు. దీంతో బోటు మరింత వేగం అందుకుంది. దీంతో అప్రమత్తమైన కోస్టు గార్డు సిబ్బంది, పాక్ బోటును దాదాపు గంట సేపు వెంబడించారు. బోటుకు అత్యంత సమీపంలోకి వెళ్లి చూసిన కోస్ట్ గార్డు సిబ్బందికి, బోటు సిబ్బంది మొత్తం డెక్ కింద భాగంలో దాక్కుని ఉండడం గమనించారు. దీంతో తక్షణం వారు లొంగిపోవాలని హెచ్చరించారు. దీంతో భారత్ కోస్ట్ గార్డు తమను ప్రాణాలతో పట్టుకునే ప్రమాదముందని భావించిన తీవ్రవాదులు పేల్చేసుకున్నారు. దీంతో భారీ ఎత్తున పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. పేలుడు నుంచి ఎవరైనా తప్పించుకున్నారేమోనన్న అనుమానంతో కోస్ట్ గార్డ్ సిబ్బందితో పాటు నేవీ హెలికాప్టర్లు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు జరిపాయి. కాగా సదరు బొటు కరాచీ సమీపంలోని కేతిబందర్ నుంచి బయల్దేరినట్లు గుర్తించారు. ఈ ఘటనతో నిఘా వర్గాలతో పాటు, అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.