: రెండు సార్లూ సముద్ర మార్గమే... తూర్పుతీరం సురక్షితమేనా?
భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ తీవ్రవాదులు సముద్ర మార్గాన్నే నమ్ముకుంటున్నారు. దీంతో తూర్పుతీరం సురక్షితమేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నౌకాదళం కలిగిన దేశాల్లో ఒకటైన భారత నౌకా దళం, పాక్ తీవ్రవాదులు విసురుతున్న సవాళ్లను స్వీకరించగలదా? పాక్, శ్రీలంక, చైనా దేశాల నౌకాదళాల, మత్స్యకారుల ఉల్లంఘనలతో నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్న తీరరక్షక దళం సముద్ర మార్గాన వచ్చే తీవ్రవాదులను అడ్డుకోగలదా? అనే అనుమానాలు రేగుతున్నాయి. తీర రక్షక దళం నిత్యం అప్రమత్తంగా ఉంటుందని, భారత జలాల్లో ఎవరు అక్రమంగా ప్రవేశించినా పసిగట్టే వ్యవస్థ భారత్ సొంతమని గతంలో పలు మార్లు నావికాదళాధికారులు తెలిపారు. అయితే 26/11 దాడులకు పాల్పడ్డప్పుడు పాక్ తీవ్రవాదులు సముద్ర మార్గాన్నే ఎంచుకోగా, తాజాగా పాక్ తీవ్రవాదులు గుజరాత్ లోని పోరుబందర్ సమీపంలోకి చొచ్చుకువచ్చారు. దీంతో తీరప్రాంతం సురక్షితమేనా? మత్స్యకారులు సమాచారం ఇస్తే తప్ప రక్షదళానికి సమాచారం చేరే మార్గం లేదా? అనే అనుమానం రేకెత్తుతోంది. కాకుంటే సమాచారం అందిన వెంటనే నౌకాదళం క్షణాల్లో అప్రమత్తమవ్వడం కాస్త తృప్తి కలిగించే అంశమే. భవిష్యత్ లో సముద్ర మార్గంలో పాక్ తీవ్రవాదులు రాకుండా, వచ్చినా తెలిసిపోయేలా వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం తీవ్రతను పరిస్థితులు తెలియచెబుతున్నాయి.