: నగర శివారులో కేసీఆర్ బంధువు హల్ చల్... 40 ఎకరాల దురాక్రమణ?
తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువుగా చెలామణి అవుతున్న ప్రవీణ్ రావు అనే వ్యక్తి హైదరాబాద్ శివారులోని రాజేంద్ర నగర్ పరిధిలో భూములను దురాక్రమించారు. దీనిపై అటు పోలీసులు కాని, ఇటు రెవెన్యూ అధికారులు కాని చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజేంద్ర నగర్ పరిధిలోని బుద్వేల్ లో 310, 11, 12 సర్వే నెంబర్లలోని 40 ఎకరాల భూమిని హ్యాపీ హోమ్స్ అనే సంస్థ 1996లో జీవీ సత్యనారాయణ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసింది. ‘హ్యాపీ హోమ్స్-సాగర్ హిల్స్’ పేరిట వెంచర్ వేసి కొనుగోలుదారులకు విక్రయించేసింది. అయితే ఈ స్థలం తమదని కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లారు. దీనిపై కొనుగోలుదారులు కూడా కోర్టుకెక్కారు. అయితే వీరందరినీ కాదని ఇటీవల ప్రవీణ్ రావు అనుచరులు ఈ స్థలాన్ని దురాక్రమించారు. ఈ స్థలం ప్రవీణ్ రావుకు చెందిన తిరుమల తిరుపతి కన్ స్ట్రక్షన్స్ కు చెందినదనే బోర్డును కూడా ఏర్పాటు చేశారు. భూమిని స్వాధీనం చేసుకునే క్రమంలో ప్రవీణ్ రావు అనుచరులు బీభత్సం సృష్టించారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేందుకు పోలీసులు తొలుత ససేమిరా అన్నారు. దీంతో మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డిలతో పాటు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని కూడా బాధితులు కలిశారు. కార్తీక్ రెడ్డి సూచన మేరకు వారు మానవ హక్కుల కమిషన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లను కలిశారు. అయినా కేసు నమోదు కాలేదు. ఇక లాభం లేదనుకుని బాధితులు నేరుగా కోర్టు మెట్లెక్కారు. కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు స్పందించిన పోలీసులు ప్రవీణ్ రావు సహా ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.