: కోచ్ గా హసీ పేరు తెరపైకి తెచ్చిన ధోనీ!
టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నా, ధోనీ ఆలోచలన్నీ టీమిండియా బాగోగుల చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. ప్రస్తుత కోచ్ డంకన్ ఫ్లెచర్ పదవీకాలం వరల్డ్ కప్ తో ముగియనుంది. ఆ తర్వాత కోచ్ ఎవరన్నదానిపై ధోనీ ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ హసీ అయితే టీమిండియా కోచ్ గా అతికినట్టు సరిపోతాడని ధోనీ భావిస్తున్నాడట. ఇదే విషయాన్ని బీసీసీఐకి కూడా సూచించినట్టు క్రికెట్ వర్గాల్లో ప్రచారమవుతోంది. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన సమయంలో హసీతో ధోనీకి సాన్నిహిత్యం ఏర్పడింది. హసీ వ్యవహారశైలి టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ ను పోలి ఉంటుంది. వ్యక్తిగా ప్రశాంతంగా ఉండే హసీ ఆటలో మాత్రం దూకుడు ప్రదర్శిస్తాడు. పరిస్థితులకు తగ్గట్లుగా గేర్లు మార్చి ఆటను ముందుకు తీసుకెళ్లడంతో ఈ ఆస్ట్రేలియన్ దిట్ట. అందరితోనూ కలుపుగోలుగా ఉండే అతని నైజం ధోనీని ఆకర్షించి ఉంటుందని క్రికెట్ పండితులంటున్నారు. అటు, వన్డేల్లో రాణిస్తున్నా, టెస్టుల విషయానికొచ్చేసరికి విదేశీ గడ్డపై టీమిండియా విఫలమవుతుండడం ఫ్లెచర్ పనితీరును ప్రశ్నార్థకం చేసింది. అతడిని సాగనంపాలని మాజీ క్రికెటర్లు ఎన్నోసార్లు సూచించారు. అయితే, ధోనీ మద్దతు పుష్కలంగా ఉండడంతో వరల్డ్ కప్ వరకు కాంట్రాక్టు పొడిగించారు. ఆ తర్వాతేంటన్న విషయం తెరపైకి వస్తున్న తరుణంలో, ధోనీ తన మిత్రుడు హసీ పేరును ప్రతిపాదించినట్టు అర్థమవుతోంది.