: ధోనీ మౌనం దేనికి సూచన?
ధోనీ టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పి రెండ్రోజులు కావస్తోంది. అతడు ఐదు రోజుల ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడని బీసీసీఐ చెప్పిందే గానీ, కథానాయకుడు మాత్రం పెదవి విప్పలేదు! ఆసీస్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా సిడ్నీలో చివరి టెస్టు జరగనుంది. ఆ మ్యాచ్ కోసం టీమిండియా సిడ్నీ పయనం కాగా, ధోనీ కూడా జట్టు వెంటే వెళ్లాడు. అక్కడ మీడియాతో ఒక్క ముక్క మాట్లాడింది లేదు. అంతకుముందు, మెల్బోర్న్ టెస్టు ముగిసిన తర్వాత మ్యాచ్ గురించి మాట్లాడాడే గానీ, తన రిటైర్మెంట్ కు సంబంధించి ఏ విషయమూ పంచుకోలేదు. అతని తరపున భారత క్రికెట్ బోర్డే అన్ని విషయాలు మీడియాకు తెలిపింది. ఎందుకీ మౌనం? తాను రిటైరవుతున్నట్టు ధోనీ ఎందుకు స్వయంగా ప్రకటించలేదు? ఈ ప్రశ్నకు జవాబులు చెప్పాల్సింది ధోనీయే అయినా, అతను తీసుకున్న నిర్ణయం మాత్రం తీవ్రమైనదని క్రికెట్ పండితులంటున్నారు. ఆటగాళ్ల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయని, అవే ధోనీ టెస్టు క్రికెట్ నిష్క్రమణకు కారణమయ్యాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో టీమిండియా డైరక్టర్ హోదాలో రవిశాస్త్రి ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం, కోహ్లీ-శాస్త్రిల మధ్య పెరుగుతున్న 'సమన్వయం' కూడా ధోనీపై ప్రభావం చూపాయన్నది మరికొందరి వాదన! అయితే, ఓ వరల్డ్ క్లాస్ క్రికెటర్, ముఖ్యంగా, ధోనీ వంటి దిగ్గజం ఏ ఫార్మాట్ నుంచైనా గౌరవంగానే తప్పుకోవాలని భావించడం సహజం. కానీ, ఎలాంటి హడావుడి లేకుండా, అకస్మాత్తుగా గుడ్ బై చెప్పడమే ఇప్పుడు సందేహించాల్సిన అంశం. బీసీసీఐ కూడా ధోనీ మనసు మార్చాలని ఎంతో ప్రయత్నించినా, రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు ససేమిరా అనడం ఏదో సమస్య ఉందన్న విషయాన్ని చూఛాయగా చాటుతోంది. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం సరైనదేనంటున్న మాజీలు, హఠాత్తుగా ప్రకటించడంపై మాత్రం తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిరీస్ లో మరో టెస్టు మిగిలుండగానే తప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని మాజీ కెప్టెన్ గంగూలీ ప్రశ్నించాడు. వేలికి గాయంతోనే ధోనీ ఆస్ట్రేలియా టూర్ కు వచ్చాడని, అయితే, గాయంతోనే సిడ్నీ టెస్టు ఆడకుండా తప్పుకున్నాడా? అన్న విషయం మాత్రం తెలియదని దాదా పేర్కొన్నాడు. ఇక, దిగ్గజ బ్యాట్స్ మన్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, సిడ్నీ టెస్టు తర్వాత ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని భావించానని, అయితే, ముందుగానే నిర్ణయం ప్రకటించడం విస్మయానికి గురిచేసిందని అన్నాడు. టెస్టు క్రికెట్ కు ఆటగాడిగా కూడా వీడ్కోలు పలుకుతాడని మాత్రం ఊహించలేదన్నాడు.