: 'పీకే' తప్పక చూడాల్సిన చిత్రమంటున్న అఖిలేశ్... నితీశ్ కుమార్ ఫుల్ మార్క్స్
నటుడు అమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రంపై ఓ వైపు వ్యతిరేకత వ్యక్తమవుతుంటే... ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మాత్రం తప్పకుండా చూడాల్సిన చిత్రమని కితాబు ఇస్తున్నారు. తన నివాసంలో సినిమాను చూసిన అఖిలేశ్, 'నైస్ ఫిల్మ్' అని ప్రశంసించారు. మీరు కూడా వెళ్లి చూడాలని మీడియా మిత్రులను కోరారు. సరైన కారణం లేకుండా కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. మరోవైపు 'పీకే' చూసిన బీహార్ మాజీ సీఎం, జేడీయూ ముఖ్య నేత నితీశ్ కుమార్ కూడా తన మద్దతు తెలిపారు. ఈ చిత్రానికి పదికి పది మార్కులు ఇస్తున్నానన్నారు. సమాజానికి సానుకూల సందేశాన్ని ఇచ్చే సినిమా అని చెప్పారు. కేవలం వినోదమేకాక చైతన్యాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా పాప్యులర్ అయిందని, ప్రజలు విజ్ఞానాన్ని పొందేందుకు సాయపడుతుందని నితీశ్ తెలిపారు.