: ‘రాజధాని పొలాలకు నిప్పు’ నిందితుల ఆచూకీ చెబితే రూ.5 లక్షల నజరానా: గుంటూరు ఐజీ
నవ్యాంధ్ర నూతన రాజధాని పరిధిలోని గ్రామాల పొలాలకు నిప్పు పెట్టిన నిందితుల ఆచూకీ చెబితే రూ.5 లక్షల నజరానా ఇవ్వనున్నట్లు ఏపీ పోలీసు శాఖ ప్రకటించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం గుంటూరు రేంజి ఐజీ పీవీ సునీల్ కుమార్ ప్రకటించారు. మూడు రోజుల క్రితం రాజధాని గ్రామాల పొలాల్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు ఘటనకు కారకులెవరన్న విషయంపై ఆరా తీస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని సునీల్ కుమార్ ప్రకటించారు. ఈ బృందాలు రాత్రి, పగలనే తేడా లేకుండా నిందితులను పట్టుకునేందుకు కూంబింగ్ తరహా ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో పెను సంచలనం రేపిన ఈ ఘటనకు కారకులైన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సునీల్ కుమార్ తెలిపారు.