: డ్రెస్సింగ్ రూంలో ధోనీ ఎమోషనల్
టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలని ధోనీ తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేసింది. వరల్డ్ కప్ అనంతరం అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటాడని ఓ వాదన వినిపిస్తున్న సమయంలో వెలువడిన ఈ నిర్ణయం అటు క్రికెట్ ప్రపంచంతో పాటు ఇటు బీసీసీఐని కూడా ఆశ్చర్యపరచింది. ఇక, తన నిర్ణయం చెప్పేటప్పుడు ధోనీ డ్రెస్సింగ్ రూంలో భావోద్వేగానికి గురయ్యాడట. బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ మాట్లాడుతూ, మెల్ బోర్న్ టెస్టు ముగిసిన వెంటనే డ్రెస్సింగ్ రూంలో ధోనీ తన రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో కాస్త ఎమోషనల్ గా ఫీలైనట్టు తెలిసిందని తెలిపాడు. టెస్టు క్రికెట్ కు వీడ్కోలు ప్రకటన చేయగానే, సహచరులందరూ ధోనీని హత్తుకుని విషెస్ చెప్పడంతోపాటు అతనితో ఫొటోలు తీసుకున్నారట. టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి ఈ విషయంపై ఓ వెట్ సైట్ తో మాట్లాడుతూ, "డ్రెస్సింగ్ రూంలోకి వచ్చిన ధోనీ జట్టునంతటినీ సమావేశపరిచాడు. ఆపై తన నిర్ణయం తెలిపాడు. అక్కడ డ్రామా ఏమీ చోటు చేసుకోలేదు. దాపరికం లేకుండా మనసులో మాట వెల్లడించాడు. ఇకపై అన్ని ఫార్మాట్లూ ఆడలేనన్నాడు. అందుకే టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాని చెప్పాడు. తానేం చేయదల్చుకున్నాడో అదే చేసే వ్యక్తి ధోనీ. చివరి వరకు సత్యానికి కట్టుబడ్డాడు. అన్ని ఫార్మాట్లు ఆడలేనని చెప్పగలిగిన అతని ధైర్యమే స్పష్టం చేస్తుంది... తన పట్ల, సహచరుల పట్ల ఎంత నిజాయతీగా వ్యవహరించాడో" అని వివరించాడు.