: నల్గొండ జడ్పీ ఛైర్మన్, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ లు 'కారు' ఎక్కారు!
టీఆర్ఎస్ 'ఆపరేషన్ ఆకర్ష్' ఇంకా కొనసాగుతోంది. తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో నల్గొండ జడ్పీ ఛైర్మన్ బాలు నాయక్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి నాయక్ ను కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, బాలు నాయక్ కు చాలా అనుభవం ఉందని, అతడిని దేవరకొండ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా నియమిస్తున్నట్టు చెప్పారు. మంత్రి జగదీశ్ రెడ్డితో కలసి పార్టీని జిల్లాలో మరింత విస్తరించాలని పేర్కొన్నారు. కాగా, నల్గొండ జిల్లా నుంచే మంచినీళ్ల పథకాన్ని ప్రారంభిస్తానని కేసీఆర్ చెప్పారు.