: ధోనీ మరికొన్నాళ్లు ఆడితే బాగుండేది!: ప్రముఖుల కామెంట్లు
టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆకస్మిక రిటెర్మెంట్ నిర్ణయం క్రీడాభిమానులనే కాకుండా, క్రికెట్ దిగ్గజాలను కూడా విస్మయానికి గురిచేస్తోంది. ధోనీ రిటైర్మెంట్ నిర్ణయంపై పలువురు స్పందించారు. కెప్టెన్ ధోనీ ఆసీస్ సిరీస్ మొత్తం ఆడితే బాగుండేదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ధోనీ మరికొన్నాళ్లు టెస్టులు ఆడతాడని భావించినట్టు తెలిపాడు. ధోనీకి మరో మూడేళ్లు టెస్టులు ఆడే సామర్థ్యం ఉందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ధోనీ సహచరుడు, టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా... ధోనీ ఆగమనం, సారథ్యం, నిష్క్రమణ సాహసోపేతమని ట్వీట్ చేశాడు. ధోనీ అన్నింట్లోనూ మార్గదర్శిగా మారాడని, ఆఖరుకు రిటైర్మెంట్ లో కూడా ధోనీ ఆదర్శంగా నిలిచాడని సినీనటుడు పరేష్ రావల్ అభిప్రాయపడ్డారు. సినీనటి శృతిహాసన్... ధోనీ సేవలు ప్రశంసనీయమని, దేశం గర్వించదగ్గ విజయాలు అందించారని పోస్టు చేయగా, మరోనటి ప్రియమణి స్పందిస్తూ... ధోనీ నిర్ణయం బాధించిందని, అయినప్పటికీ దేశాన్ని గర్వించేలా చేశాడని పేర్కొంది.